KRNL: దేవనకొండ(మం) తెర్నకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా టీడీపీ ఆలూరు ఇంఛార్జి వైకుంఠం జ్యోతి, వైకుంఠం శివ ప్రసాద్, జనసేన ఇంఛార్జి వెంకప్ప, గోవింద్ గౌడ్ పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించి వాల్మీకి బోధనలను స్మరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
W.G: విద్యార్థులు పరీక్షలు అంటే భయం విడనాడాలని సీబీఐ మాజీ జేడీ వీ.వీ.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం తణుకు రూట్స్ స్కూలు ఆధ్వర్యంలో సీఎం ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కులు ప్రాతిపదికగా కాకుండా విద్యార్థులు భవిష్యత్తుపై గురి పెట్టాలని సూచించారు.
ATP: జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు మార్చి నెల నిత్యావసర సరుకులను సిద్ధం చేసినట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యం, జొన్నలు, రాగులు ఉచితంగా అందజేస్తామని, మున్సిపాలిటీ పరిధిలో గోధుమపిండి పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.
TPT: తిరుపతిలో కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాంతీయ సమీక్ష నిర్వహించారు. రైతులకు MSP చెల్లింపులు సమయానికి జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ సోరబ్ గౌర్ పాల్గొన్నారు.
E.G: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో ప్రభావితమైన 15 మంది రోగులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. కిమ్స్‌లో 8 మంది, డెంటల్ లో ఇద్దరు, RACCలో ఒకరు, రవి చైతన్యలో ఒకరు, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
NLR: కొడవలూరు మండలం గౌతమి నగర్ పంచాయతీలో హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేసి, చెత్త సంపద రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. రూ.36 లక్షలతో హెల్త్ క్లినిక్‌ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
E.G: పెరవలి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.
అన్నమయ్య: సామర్లకోట(మం) వేట్లపాలెంలో బాణాసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
PPM: పెదపెంకి గ్రామ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి, స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసు కున్నారు.
SKLM: జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందుతున్న పి. మాధవరావుకు శనివారం జిల్లా ఎస్పీ ఆఫీసులో రిటైర్మెంట్ కార్యక్రమం నిర్మించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవి రమణ హాజరై, మాధవరావును పూలమాలలు, దుశాలువతో సత్కరించారు. సుదీర్ఘకాలంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖకు అందించిన సేవలను ప్రశంసించారు.
VSP: పెడగాడి టిడ్కో కాలనీ సీ-1 బ్లాక్‌లో మంచినీటి సమస్య తలెత్తడంతో బాధితుల పిలుపుమేరకు మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈ కనకరాజు శనివారం వెంటనే స్పందించారు. శుద్ధ కారణంగా పైపులు స్ట్రక్ అవుతున్నాయని గుర్తించి, మూడు రోజుల్లో పైపులు, మేన్‌హోల్స్ క్లీనింగ్ చేపడతామని తెలిపారు. గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ అడుగున మట్టి పేరుకుపోవడంతో పంపింగ్‌కు ఆటంకం కలుగుతోందన్నారు.
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, భోగాపురం మండలం, ముంజేరు గ్రామ పంచాయితీలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మన పల్లె శుభ్రత-మనందరి బాధ్యత అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది.
AKP: నాతవరం మండలంలో శాంతిభద్రతలు కరువయ్యాయని వైసీపీ మండల అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు అన్నారు. శనివారం నాయకులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం తమపై, తమ పార్టీ సానుభూతిపరులపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, తప్పుడు కేసులు బనాయించి వారిని భయభ్రాంతులను చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి అన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి లోని క్యాంప్ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారన్నారు.
కృష్ణా: మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఏఐటీయుసీ జిల్లా కన్వీనర్ లింగం ఫిలిప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఫిలిప్ మాట్లాడుతూ.. మెడికల్ మాఫియా వల్ల పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తెలిపారు.