• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మెరుగైన సేవల కోసం కాల్ చేయండి’

NLR: నెల్లూరు నగరం ఆర్టీసీ డిపో పరిధిలోని బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కోసం డయల్ యువర్ డీఎం గురువారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ప్రజలు కాల్ చేసి సలహాలు ఇవ్వడంతో పాటు సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని DM వెంకటేశ్వర్లు సూచించారు. 9959225641 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.

February 26, 2026 / 09:15 AM IST

పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ బదిలీ

AKP: పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్‌కు బదిలీ అయింది. ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఆదేశాలు భారీ చేశారు. ఈ మేరకు ఆయనను ప్రభుత్వం గుంటూరు జిల్లా మంగళగిరి హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

February 26, 2026 / 09:15 AM IST

పత్తికొండ, ఆత్మకూరు ఆర్డీవోలకు స్థానచలనం

KNRL: ఉమ్మడి జిల్లాలోని పత్తి కొండ RDO భరత్ నాయక్, ఆత్మకూరు RDO దేశిరెడ్డి నాగజ్యోతి బదిలీ అయ్యారు. వీరిని తక్షణమే రిలీవ్ చేయాలని, రిలీవ్ అయిన వెంటనే JADలో రిపోర్టు చేసుకోవాలని జీఓ ఆర్టీ నంబర్ 477ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విడుదల చేశారు. వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతరులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

February 26, 2026 / 09:10 AM IST

‘ఎయిర్‌పోర్ట్ పనులను వేగవంతం చేయండి’

SKLM: మంగళగిరిలోని ఏపీ ఎయిర్‌ పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్యని పలాస ఎమ్మెల్యే శిరీష బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలాసలో నిర్మించునున్న ఎయిర్‌ పోర్టు నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశాలున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే ఆయనకు తెలిపారు.

February 26, 2026 / 09:08 AM IST

పి.కొత్తకోట సమీపంలో గుంతలమయమైన సర్వీస్ రోడ్డు.!!

CTR: బెంగళూరు-నాయుడుపేట జాతీయ రహదారిలో పి.కొత్తకోట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీపురం వద్ద సర్వీస్ రోడ్డు గుంతలతో దెబ్బతింది. మూడు నెలలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుందని వారు పేర్కొన్నారు.

February 26, 2026 / 09:07 AM IST

ధర్మవరం ఆర్డీవో, డీఎస్పీ బదిలీ

సత్యసాయి: ధర్మవరం ఆర్డీవో మహేశ్, డీఎస్పీ హేమంత్ కుమార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ విజయానంద్ వీరికి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే సాధారణ పరిపాలన శాఖలో (జీఏడీ) రిపోర్ట్ చేయాలని సూచించారు. పరిపాలనా కారణాల వల్ల ఈ ఆకస్మిక బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.

February 26, 2026 / 09:03 AM IST

ధర లభించకపోవడంతో చామంతి రైతుల ఆవేదన

ATP: శింగనమల నియోజకవర్గం నాయనపల్లి క్రాస్ రైతులు సంప్రదాయ పంటల్లో లాభాలు లేక చామంతి సాగు చేపట్టారు. విద్యుత్ బల్బుల వెలుగులో దిగుబడులు పెంచి ఆకర్షణీయమైన పూలను పండిస్తున్నారు. వీటిని బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. పంట బాగున్నా ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 09:01 AM IST

పురిటిబిడ్డ మృతి.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

అన్నమయ్య: ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు మూర్ఛ రావడంతో వైద్యుల సూచన మేరకు మరో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

February 26, 2026 / 09:01 AM IST

పిచ్చి కుక్కల బెడద.. సీపీఐ హెచ్చరికలు

NDL: బనగానపల్లెలో వీధి కుక్కల దాడులతో ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారని CPI మండల కార్యదర్శి శివయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కాలనీ, కరీంబాగ కాలనీల్లో పిచ్చి కుక్క దాడులకు దాదాపు 30 మంది గాయపడ్డారని బుధవారం రాత్రి తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే చర్యలు తీసుకోకపోతే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

February 26, 2026 / 09:00 AM IST

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు రిమాండ్

KDP: లంచం తీసుకుంటూ పట్టుబడిన పులివెందుల రూరల్ సీఐ ఎస్.వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్సై దాసరి అనిల్ కుమార్‌లు బుధవారం జైలు పాలయ్యారు. ఈనెల 23న వారు రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. సీఐ, ఎస్సైలను బుధవారం కర్నూలులోని అనిశా కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.

February 26, 2026 / 09:00 AM IST

కురుపాం ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

PPM: కురుపాం ఆదర్శ పాఠశాలలో 2026-27 సంవత్సరానికిగాను ఆరో తరగతి ప్రవేశాలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ రామలక్ష్మి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 30వ తేదీ లోపు సంబంధిత పాఠశాల వెబ్‌సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అలాగే ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని విద్యార్థులకు సూచించారు.

February 26, 2026 / 09:00 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్-వాష్ అండ్ గో’

KRNL: రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు ‘స్టాప్-వాష్ అండ్ గో’ కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జాతీయ రహదారులపై వాహనాలను ఆపి డ్రైవర్ల పత్రాలు, లైసెన్సులు పరిశీలిస్తున్నారు. నీటితో ముఖం కడిగించి అప్రమత్తంగా ప్రయాణించాలన్నారు. అధిక వేగం, రాంగ్ రూట్ నిషేధమన్నారు.

February 26, 2026 / 08:50 AM IST

రౌడీ షీటర్‌పై పీడీ యాక్ట్

W.G: తణుకు (M) ఇరగవరం కాలనీకి చెందిన రౌడీషీటర్ వల్లూరి పండుబాబుపై పోలీసు ఉన్నతాధికారులు పీడీ యాక్ట్ ఉపయోగించి జైలుకు తరలించారు. 12 తీవ్రమైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పండుబాబు తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా హత్యయత్నాలు, దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నాడని అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీఐ డి. వెంకటేశ్వరరావు తెలిపారు.

February 26, 2026 / 08:50 AM IST

‘రహదారి వ్యవస్థను నిర్వీర్యం చేశారు’

E.G: గత వైసీపీ ప్రభుత్వం రహదారి వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, కూటమి ప్రభుత్వం దాన్ని గాడిలో పెడుతోందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం అసెంబ్లీలో అన్నారు. బడ్జెట్లో రూ.9,014 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి కడియం, జొన్నాడ వెళ్లే రోడ్ల పనులు వేగవంతం చేయాలని కోరారు

February 26, 2026 / 08:48 AM IST

మార్కాపురం విద్యార్ధినిని అభినందించిన సీఎం

ప్రకాశం: మార్కాపురంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రం అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు సీఎం చంద్రబాబు వివరించారు.

February 26, 2026 / 08:45 AM IST