W.G: తణుకు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను మంగళవారం MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని మరుగుదొడ్ల నిర్వహణ, ఆర్వో ప్లాంట్ పనితీరును స్వయంగా పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరీక్షించారు. వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
SS: గోరంట్ల(మం) గౌనివారిపల్లి పంచాయతీ కేంద్రంలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విద్యాధరణి, తదితరులు పాల్గొన్నారు.
SKLM: జిల్లా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 18వ తేదీన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.
ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్‌ను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డా. ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, నీటి వసతులు ఇతర సమస్యల గురించి ఆరా తీశారు. తరగతి గదులు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో RO ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
KRNL: గోనెగండ్లలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకులను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయ మునిస్వామి(30) అక్కడికక్కడే మృతి. మరో యువకుడు వీరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
SKLM: అర్హత గల రైతులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం హిరమండలం మండలం చొల్లంగి గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం, సబ్సిడీ పథకాలు అందాయా లేదా అని ఇంటింటికి వెళ్లి రైతులను అడిగారు.
PPM: సీతానగరం మండలం వెంకటాపురంలో మంగళవారం డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో సంచార వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, హీమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బీపీ, షుగర్ పరీక్షల అనంతరం ప్రతి నెల ఏ మేరకు మెరుగుపడుతుందో పరిశీలించారు.
SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో కొనసాగుతున్న నీటిపారుదల పనులపై ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలువల మరమ్మత్తులు, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి సరఫరా మెరుగుదలపై చర్చించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు నిరంతరంగా సాగు నీరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం: మర్రిపూడి మండలంలో అన్ని గ్రామాల్లో నాలుగు నెలలు దాటిన ప్రతి గేదెకు, ఆవుకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మంచికల మనిశేఖర్ మాట్లాడుతూ.. పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
VZM: బొబ్బిలిలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త రోడ్లు, కాలువలను పరిశీలించారు. అలాగే, వేసవి దృష్ట్యా బావుల్లో క్లోరినేషన్ చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకుని, కాలువల డీసిల్టింగ్ చేయాలని అధికారులకు సూచించారు.
అనకాపల్లి నూకాంబికా అమ్మవారి జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. మంగళవారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నెలరోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు.
ASR: అరకులోయ మండలం కొత్తబల్లుగూడ పంచాయతీ పరిధిలో మంగళవారం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా లభిస్తున్న ఆర్థిక సాయంతో గిరిజన రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు. రైతుల ఇళ్లకు వెళ్లి సాయం వివరాలను తెలుసుకొని అవగాహన కల్పించారు.
ఎన్‌టీఆర్ జిల్లా డీఎస్ఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో తిరువూరు(M) జి. కొత్తూరు గ్రామంలోని రేషన్ షాప్‌ను PDSDT, రెవెన్యూ సిబ్బంది తనిఖీ చేశారు. అయితే రేషన్ బియ్యం వేరే ఇంటిలో నిల్వ ఉంచడంతో 65 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు నిల్వ ఉంచినట్లు గుర్తించి సంబంధిత వ్యక్తిపై 6A కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
కృష్ణా: సభ్యత్వ నమోదు విస్తృత స్థాయిలో జరుగుతోందని జనసేన పార్టీ మండల నాయకులు అనుమకొండ పూర్ణచంద్రరావు తెలిపారు. మంగళవారం చల్లపల్లిలోని లయన్స్ కాంప్లెక్స్ ఎదుట సభ్యత్వ నమోదు శిబిరం వద్ధ పలువురు జనసేన పార్టీలో చేరారు. ఒకటో వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 14 మంది పూర్ణచంద్రరావు సమక్షంలో సభ్యత్వములు పొందారు.