W.G: ఉండి మండల చెరుకువాడ గ్రామం 13 నెంబర్ పంట బోధి తవ్వకం పనులను ఉండి DC కమిటీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు. మండల క్లస్టర్ ఇంచార్జ్ యర్రంకి బుజ్జి, గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబ శివరావు పాల్గొన్నారు.
SKLM: జిల్లాలో ఈ సంవత్సరం మామిడికాయల కొరత ఏర్పడింది. మార్కెట్లో కిలో మామిడి రూ.120-140 పలుకుతోంది. ఒక్కో కాయ సైజును బట్టి రూ.20-30కి కూడా అమ్ముతున్నారు. ధరలు పెరిగినా పండుగ కోసం వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. మంచు ప్రభావం, వాతావరణ మార్పులు వలన మామిడి పంట ఆలస్యం అయిందని రైతులు తెలిపారు.
GNTR: పెడనందిపాడు మండలంలోని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహనరావు, మండల వ్యవసాయ అధికారి ఐ. సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రైతులు పంచ సూత్రాలు పాటించాలని సూచించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్‌పై అవగాహన కల్పించారు. రైతులు నమోదు చేసుకుని యాప్ వినియోగించాలని తెలిపారు.
ATP: జిల్లా ప్రజలకు ఎస్పీ పీ.జగదీష్ ఉగాది, రంజాన్ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. నూతన తెలుగు సంవత్సరాదిలో అందరికీ శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఉగాదిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సేవా దృక్పథంతో, ఆధ్యాత్మిక చింతనతో పండుగలను జరుపుకోవాలని సూచించారు.
సత్యసాయి: బుక్కపట్నం మండలం యాదలంకిపల్లి రైతులు పొలాలకు వెళ్లేందుకు రామ్ సాగరం వంక అడ్డంకిగా మారింది. ఆర్డీటీ చెక్ డ్యాం కింద ఉన్న 150 ఎకరాల సాగు భూమికి వెళ్లాలంటే నిత్యం మూడు అడుగుల నీటిలో ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోంది. పాములు, వన్యప్రాణుల భయంతో కూలీలు పనులకు రావడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం: నూతన నోటరీ న్యాయవాదిగా మార్కాపురానికి చెందిన మొగల్ అన్వర్ బేగ్‌ను ఏపీ ప్రభుత్వం బుధవారం నియమించింది. ఏ మేరకు రెవిన్యూ (రిజిస్ట్రేషన్ – ll) శాఖ జీవో జారీ చేసింది. మార్కాపురం ప్రాంత ప్రజలకు ఇకపై మరిన్ని సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని, పూర్తి వివరాల కోసం కోర్టు సెంటర్ సమీపంలో గల తమ కార్యాలయంలో సంప్రదించాలని ప్రజలకు ఆయన సూచించారు.
కృష్ణా: గన్నవరంలో బుధవారం ఈదురుగాలులు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ అయిన వెంటనే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశారు. విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి, అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మళ్లీ గన్నవరం బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.
NDL: డోన్ జాతీయ రహదారిపై ఓబుళాపురం మిట్ట వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. హైదరాబాద్‌కు చెందిన భార్గవ్ కుటుంబంతో కలిసి టూర్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్గవ్ భార్య, కూతురు యశస్వి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NLR: రైతులకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మనుబోలులో ఇవాళ ఆయన పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. మిల్లర్లతో సోమిరెడ్డి మిలాఖత్ అయి దోచుకుంటున్నారని ఆరోపించారు.
బాపట్ల పాత బస్టాండ్ వద్ద ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం, బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో బాపట్ల నుంచి పిట్టలవానిపాలెం వరకు ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
E.G: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని దివ్యాంగులు అన్ని రంగాలలోనూ రాణించాలని MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకాంక్షించారు. బుధవారం రాజమండ్రి రూరల్ MPDO కార్యాలయం వద్ద ‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.
VSP: దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం “దివ్యాంగ శక్తి పథకం”ను అమలు చేస్తూ ఉచిత బస్సు సౌకర్యాన్ని బుధవారం ప్రారంభించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల రవాణా సమస్యలు తగ్గి, సామాజిక-ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతుందని తెలిపారు.
TPT: వరదయ్యపాలెం మండల కేంద్రంలో రోడ్డు దారుణ స్థితికి చేరుకుంది. ఇటీవల వాటర్ పైప్‌లైన్ పనుల కోసం రోడ్డు పక్కన తవ్విన గుంతలను పూడ్చకపోవడంతో దుమ్ము, గుంతలు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోవర్ధనపురం పాములు కాలువ చెక్‌పోస్ట్ వద్ద కూడా రోడ్డు అధ్వానంగా మారింది. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
కర్నూలు నగర ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. చేదు అనుభవాలను మర్చిపోతూ.. ఆత్మీయత అనుబంధాలను పెంచుకుంటూ జీవించాలని తెలియజేసే పండగ ఉగాది అని అన్నారు.
KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇవాళ పెద్దకడబూరులో మండల అధ్యక్షురాలు మేరమ్మ అధ్యక్షతన “పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026” నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు.