NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం తెలిపారు. చంద్రమౌళి నగర్లో రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో చేపట్టిన 240 పనుల్లో ఇప్పటికే 235 పనులు పూర్తి చేశామని వెల్లడించారు. మార్చి 3వ వారంలో ప్రారంభిస్తామన్నారు.
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో వార్డు మెంబర్ గోవిందమ్మ భర్త, వైసీపీ నాయకులు వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, స్థానిక నాయకుడు జాము మూకయ్య తదితరులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
KDP: 40 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శివానందపురం కాలనీ మెయిన్ రోడ్డును టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి నాయకత్వంలో సుమారు రూ. 30 లక్షలతో నిర్మించిన ఈ రహదారి స్థానికులకు ఎంతో ఉపశమనం కలిగించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు పూర్తి కావడంతో కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దంపతులు విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం గుంటూరు జిల్లా చినకొండ్రుపాడులో విశ్వనగర్లోని విశ్వగురు పీఠంలో ఆయనను మండలి బుద్ధప్రసాద్-విజయలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఈ నెల 4-5 తేదీల్లో విశ్వంజీ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: ఓబులదేవరచెరువులో పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రకాశం: మార్కాపురం కూరగాయల మార్కెట్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బార్ అండ్ రెస్టారెంట్‌ను తొలగించాలని వ్యాపారస్తులు సోమవారం ఆందోళన చేశారు. 30 అడుగుల దూరంలో రామాలయం, బాయ్స్ హై స్కూల్, కూరగాయల మార్కెట్, మున్సిపల్ కార్యాలయాలు ఉండడం విశేషం. బార్ షాపులో తొలగించి తమకు న్యాయం చేయాలని మహిళ వ్యాపారస్తులు డిమాండ్ చేశారు.
ATP: శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామంలో నివాసముంటున్న కుంచపు అరుణ కుమార్తె శ్రీదివ్య వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాల శుభకార్యాలకు అండగా నిలవడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
W.G: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మంగళవారం ఏర్పడుతుందని జనవిజ్ఞాన వేదిక జిల్లా సభ్యుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు తెలిపారు. ఈ అరుదైన గ్రహణం మధ్యాహ్నం 3.21 గంటలకు గ్రహణం ప్రారంభం అవుతుందని అన్నారు. వందేళ్ల తర్వాత హోలీ పండుగ రోజు ఇలా ఏర్పడటం దీని ప్రత్యేకత. గ్రహణం మొత్తం వ్యవధి 3: 27 నిముషాలు పడుతుంది.
AKP: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 383 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,375 మంది హాజరు కావలసి ఉండగా 8,992 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
PPM: మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం మ్యాథ్స్ పరీక్షకు 375 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2,794 మందికి 38 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,964 మందికి 337మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5758 మంది విద్యార్థులకు 5383 మంది హాజరు కాగా, 375 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
శ్రీకాకుళం విలీన పంచాయతీ తోటపాలెంలోని డోలపేట గ్రామానికి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. జెడ్పీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని సూచించారు. రోడ్డు పూర్తిగా పాడైందని చెప్పారు. అనేక సార్లు అధికారులు దృష్టికి సమస్య తీసుకువెళ్లినట్లు వివరించారు.
కాకినాడ రూరల్ 3వ డివిజన్ మూడు గుళ్ల కూడలి వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చిన కొండమూరి రాజు (45)గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జాయింట్ కలెక్టర్ సీ. విష్ణుచరణ్ స్వయంగా విన్నారు. భూ సమస్యలు, ఇతర సామాజిక పింఛన్ల వినతులను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పాల్గొన్నారు.
ELR: ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో కాదు ప్రజా క్షేత్రంలోకి వస్తే దోమల బెడద తెలుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి గోపాలన్ అన్నారు. సీపీఎం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర సోమవారం గణపవరం మండలంలో గణపవరం, వరదరాజుపురం, అర్థవరం, ముగ్గళ్ళ, పిప్పర, చిలకంపాడు మీదుగా సాగింది. దోమల బెడద పడలేకపోతున్నామని ప్రజలు పాదయాత్ర బృందం ముందు వాపోయారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక 46వ డివిజన్ బృందావనం ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. డివిజన్ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేట్ సంస్థలకు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.