CTR: కుప్పంలోని ప్యాలెస్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేసినట్లు అర్బన్ CI శంకరయ్య తెలిపారు. ప్యాలెస్ ఏరియాలో దేవేంద్ర తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో చిన్నపాటి షెడ్డు ఏర్పాటు చేసి, టపాసులు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో తనిఖీలు చేపట్టి రూ.4,22,250 విలువ గల టపాసులను స్వాధీనం చేసుకున్నారు.
TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా విపరీతంగా జరుగుతోందని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ఇంఛార్జ్, కూటమి నాయకులు కలిసి స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
E.G: మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలను 138 కేంద్రాలలో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు వెల్లడించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 24,538 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. అందులో అబ్బాయిలు 12,555 మంది, అమ్మాయిలు 11,983 మంది ఉన్నారన్నారు. పరీక్షలకు 1,600 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.
ప్రకాశం: కనిగిరి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 1,278 కేసులు పరిష్కరించబడినట్లు జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ తెలిపారు. వాటిలో క్రిమినల్ కేసులు 39, సివిల్ కేసులు 32, భరణం కేసులు 2, చెక్ బౌన్స్ కేసులు 5, ఎస్‌టీసీ కేసులు 1,200 ఉన్నాయని చెప్పారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి ఈ కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
కడప: జిల్లాలో వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననమే రాజకీయంగా చేసుకుంటున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ అంశంపై తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
TPT: జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 31,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖాధికారి కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం 165 కేంద్రాలు, 62 జోన్లు, 1,435 ఇన్విజిలేటర్లు, 179 చీఫ్ సూపరింటెండెంట్లు, 179 డిపార్ట్మెంటల్ అధికారులను ఏర్పాట్లు చేశారు.
సత్యసాయి: MLA నందమూరి బాలకృష్ణ సౌజన్యంతో హిందూపురంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సప్తగిరి డిగ్రీ కళాశాల వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 5000కు పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని విద్యావంతులైన యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ASR: ఈ నెల 16వ నుంచి 25 వరకు గూడెం కొత్తవీధి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి గిరిబాబు శనివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు.
AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరులో బ్రాండిక్స్ కంపెనీ యాజమాన్యం ల్యాండ్ లెవెలింగ్ పేరుతో రైతుల పాకలు, చెట్లను దౌర్జన్యంగా తొలగించే పనులను గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. పూర్తిగా నష్ట పరిహారాన్ని మంజూరు చేసి, గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలించిన తరువాతే పనులు చేపట్టాలని గ్రామస్తులు అడ్డుతగిలారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ప్రజలు తెలిపారు.
VZM: లారీ కింద పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తవలస మండలం కంటకాపల్లి బొగ్గు యార్డ్ వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను బొగ్గు లోడింగ్ ఆనంతరం ప్రక్కకు వచ్చి తాడు కడుతున్నాడు. ఈ క్రమంలో తాడు తెగిపోవడంతో వెనక నుంచి వస్తున్న లారీ టైర్ కింద పడడంతో తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
ATP: మహిళల భద్రత, రక్షణ చట్టాలపై ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శక్తి యాప్ పనితీరు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై మహిళలకు, చిన్నారులకు వివరించారు. ఆపద సమయంలో డయల్ 100, 112 ఇతర హెల్ప్‌లైన్ నంబర్లను ఎలా సంప్రదించాలో అవగాహన కల్పించారు.
PPM: మన్యం జిల్లాలోని గ్యాస్ వినియోగదారులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు జేసీ శనివారం పలు గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేశారు. వినియోగదారుల అవసరాలకు తగిన LPG నిల్వలు ఉన్నట్లు తెలిపారు. గ్యాస్ దొరకదనే అపనమ్మకంతో ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.
SKLM: నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు మత్తు మందులు నిర్మూలన లక్ష్యంగా జిల్లాలో వివిధ దాడులలో దొరికిన మాదక ద్రవ్యాలను నిల్వ చేయుటకు నూతన భవన నిర్మాణం కొరకు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. దీనికోసం స్థానిక SP కార్యాలయం ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో 4 సెంట్లల్లో భవనం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
బాపట్లలో మహిళ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు 10 నిమిషాల్లోనే ట్రేస్ చేసి తిరిగి అందించారు. బేతపూడి గ్రామానికి చెందిన ఇందిరాదేవి ఆటోలో ప్రయాణించే సమయంలో ఫోన్ మిస్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఫోన్‌ను గుర్తించి బాధితురాలికి అప్పగించినట్లు CI రాంబాబు తెలిపారు.
ATP: గుత్తి కోట ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కోట ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ వేడుకల ద్వారా కోట విశిష్టతను భావితరాలకు తెలియజేయడమే కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. నేడు, రేపు సాంస్కృతిక కార్యక్రమాలు జబర్దస్త్ నటుల స్కిట్లు ప్రేక్షకులను అలరించనున్నాయి.