NDL: APSSDC ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగులను ఎంపిక చేస్తారని తెలిపారు. 10వ తరగతి నుంచి పైచదువులు చదివిన వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.13 వేల-36 వేల వరకు వేతనం ఉంటుందని చెప్పుకొచ్చారు.
SKLM: అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చాపురం నుండి పలాస వైపు వెళ్లే రెండు బొలెరో వాహనాలలో 13 గేదెలను తరలిస్తుండగా హరిపురం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పశువులను రక్షణ నిమిత్తం పశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఈ ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై కె కృష్ణ ప్రసాద్ తెలిపారు.
VSP: మాజీ సీఎం, బీజేపీ కీలక నేత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బాలరాజేశ్వరరావు, రవీందర్ రెడ్డి, దీపిక రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి సాలువాతో సత్కరించారు. ఆయన రాకతో విమానాశ్రయం ప్రాంగణం నినాదాలతో మార్మోగింది.
TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ బుధవారం మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.
PLD: మాచవరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీపీ అంజమ్మ కోరారు. వర్షాలతో ఈ ఏడాది వ్యవసాయం లాభసాటిగా సాగిందని స్పెషల్ ఆఫీసర్ కృష్ణదేవరాయలు తెలిపారు. కుక్కలు, కోతుల బెడదను అరికట్టాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి సూచించారు. అలాగే రూ.1.20కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు బుధవారం ఫ్రీ ఒకేషనల్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలో గొట్టివాడ గ్రామంలో అటవీ శాఖ నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం రాజుపేటలో పామాయిల్ మొక్కల పెంపకం గురించి వివరించారు. కైలాసపట్నంలో లక్క బొమ్మల తయారీ గురించి తెలుసుకున్నారు.
NTR: నందిగామలో డ్రగ్స్ పై అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 30వ రోజుకు చేరిన ఈ ర్యాలీ జాతరను తలపించింది. డీజే సౌండ్స్‌తో సాగిన ర్యాలీలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
AKP: వేతనాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఎలమంచిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలన్నారు.
SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే చీపుర్లుపాడు వద్ద మార్కెట్ యార్డు ,సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేశారు. మొత్తం 3 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విజయనగరంలోని నందివీధిలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ వారి (గద్ది) 12వ వార్షిక మహోత్సవాలు ఇవాళ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ మహోత్సవాల్లో నెల్లిమర్ల నియోజవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతులు మీదగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
కృష్ణా: పెనమలూరు (M) తాడిగడప జిల్లా పరిషత్ హై విద్యార్థులు బుధవారం అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. చట్ట సభల్లో చట్టాలను రూపొందించడం, అమలు పరచడం, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించే తీరును స్వయంగా వీక్షించడంత విద్యార్థులు అనుభూతి చెంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోదే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
W.G: కలెక్టర్ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు.
సత్యసాయి: రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు కీలక శాఖ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ASR: పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం అరకు మండల కార్యదర్శి రామారావు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దశరథ్ కోరారు. బుధవారం బస్కి పంచాయతీలో పర్యటించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో నిరసన తెలిపారు. పెంచిన రూ.1లక్ష చెల్లించాలని కోరుతూ ఈనెల 27న నిర్వహించనున్న ఛలో ఐటీడీఏ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
ATP: సోలార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ సెంటర్‌లో సోలార్ విద్యుత్ సమస్యలను సైతం ఫిర్యాదు చేసే స్కౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు.