15 ఏళ్ళ మహా వృక్షం… ఈరోజు నుంచి ఒక చరిత్ర గా మారిపోయింది. ఆగష్టు 5న ఉదయం గోదావరి వరద ఉధృతికి ఈ మహావృక్షం నేలకొరిగింది . 1976 లో వచ్చిన పాడిపంటలు సినిమా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం వరకు గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమా నిర్మించినా, ఒక సాంగ్ షూట్ చేసినా ఈ చెట్టు ఉండాల్సిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ చెట్టుకు విడదీయరాని అనుబంధం ఉంది. కే విశ్వనాధ్ , జంధ్యాల, బాపు, వంశీ, కే రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు, ఇవీవీ సత్యనారాయణ లాంటి గొప్ప డైరెక్టర్లు కూడా గోదావరి నేటివిటీ సినిమా చేసినప్పుడు ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేసినవాళ్ళే.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉంది ఈ చెట్టు. ఆ ఊరి జనంకు సాయంత్రం వేళలో గోదావరి ఒడ్డున సేదతీరడానికి వెళ్ళినప్పుడు ఈ చెట్టు వాళ్లకి ఎన్నో మధుర అనుభూతులను ఇచ్చింది. కుమారదేవంలో షూటింగ్ అంటే అందులో అంత గొప్పేమి ఉంది, చెట్టు కిందే గా తీస్తారు అనుకునేంతగా అయిపోయింది ఆ ఊరి ప్రజలకు. తమ ఊరి ఖ్యాతిని పెంచడంలో ప్రధానపాత్ర పోషించిన చెట్టు నేలకొరగడంతో ఆ ఊరి ప్రజలనే కాకుండా యావత్ సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది ఈ వార్త