కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. కోటంరెడ్డికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆదాల పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనను ఇంచార్జీగా నియమించడంపై ఆదాల స్పందించారు. సంతోషంగా ఉందని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించి చంద్రబాబు నుంచి హామీని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకున్నారని బాలినేని శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని తెలిపారు. నెల్లూరు రూరల్ స్థానంలో ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు.
సీఎం జగన్ లక్ష్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పటివరకు పార్టీ, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి అనుచరులతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తానని వారికి చెప్పారని తెలిసింది. చంద్రబాబుతో సమావేశమై.. టికెట్ కన్ఫామ్ చేసుకున్నాక తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి ఉంటారు. వైసీపీ నేతలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అంతకుముందు పేర్ని నాని మాట్లాడారు. డిసెంబర్ 25వ తేదీన చంద్రబాబును కోటంరెడ్డి కలిశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని చెప్పారు. కోటంరెడ్డి టీడీపీ ట్రాప్‌లో పడ్డారని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ మూడు నెలల నుంచి జరుగుతుంటే ఇప్పుడు ఎందుకు చెప్పారని కోటంరెడ్డిని నిలదీశారు. స్మార్ట్ ఫోన్లలో రికార్డింగ్ ఆప్షన్ కామన్‌గా జరుగుతుందన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని కొట్టిపారేశారు.