Raghurama krishna Raju: అదే జరిగితే, వైసీపీ ఓటమి ఖాయం: రఘురామ
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే.. వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకే రెబల్ గా మారారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే.. వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు(Raghurama krishna Raju) అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకే రెబల్ గా మారారు. వేరే పార్టీలో చేరతాను అని చెప్పరు.. ఈ పార్టీని వీడరు. కానీ, విమర్శలు మాత్రం చేస్తూనే ఉంటారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవదనే ఆయన చెబుతూ వస్తున్నారు. తాజాగా, మరోసారి అలాంటి విమర్శలే చేశారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే తమ పార్టీ పని అవుట్ అని, బంగాళాఖాతంలో కలిసిపోతాం అని పేర్కొన్నారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు స్థానికంగా బలం కలిగిన ఐదారు మంది నాయకులు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలవవచ్చునని చెప్పకొచ్చారు. ఇప్పటికీ రాయలసీమలో తమ పార్టీకి ఎంతో కొంత బలం ఉందని.. అక్కడ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే తమ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు.
అవినాష్ రెడ్డి గారి అరెస్టుపై దాగుడుమూతల దాంపత్యం కొనసాగుతున్నప్పటికీ 24 గంటలలో లేదంటే 48 గంటలలో ఆయన్ని సీబీఐ అరెస్టు చేయడం ఖాయమేనని అన్నారు. తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు(Raghurama krishna Raju) గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తే తమ పార్టీకి భవిష్యత్తు లేదని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీని ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారని, అది తమ దురదృష్టం… తమ పార్టీ దురదృష్టం అని, తమని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు.