కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మన ఆచారం అన్నారు.
కాబట్టి కత్తులు పెట్టకుండా పోటీలు పెడితే బాగుంటుందన్నారు. మన సంస్కృతిని మనం మరిచిపోకూడదన్నారు. మన తల్లిదండ్రులు నేర్పిన సంప్రదాయాలు, సంస్కృతిని గౌరవిస్తూ, ముందుకు సాగాలన్నారు. పండగకి బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు అందరూ కలిసి భోజనం చేయడంలో మంచి ఉద్దేశ్యం మిగిలి ఉందన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు ఈ సంక్రాంతికి కలుస్తాయని గుర్తు చేశారు.
ప్రతి సంక్రాంతికి తమ కుటుంబం తిరుపతికి వచ్చి తమ ఊళ్లో పండుగను జరుపుకుంటామని, ఈసారి కూడా అలాగే వచ్చామని మంచు మనోజ్ చెప్పారు. బంధువులు, స్నేహితులతో కలిసి మా యూనివర్సిటీలో పండుగ సంబరాలు చేసుకుంటున్నామన్నారు. పాత చేదును వదిలేసి, కొత్తగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్లడమే బోగి ఉద్దేశ్యమన్నారు.