భారతీయుడు-2 చిత్రీకరణ కోసం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లాకు వచ్చాడు. చిత్రీకరణ కోసం ఆరు రోజుల పాటు కడపలో ఉండనున్నాడు. అయితే షూటింగ్ కోసం వచ్చిన కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ప్రజలు భారీగా తరలిరావడంతో కమల్ హాసన్ బయటకు వచ్చి పలకరించారు. అందరికీ నమస్కారం అంటూ చేతులు ఊపారు. దీనివలన షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడింది. అయినా కూడా పలు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.
కడప జిల్లాలోని పర్యాటక కేంద్రమైన గండికోటలో షూటింగ్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారతీయుడు-2 సినిమా షూటింగ్ 6 రోజుల పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఓ సెట్టింగ్ కూడా వేశారని సమాచారం. గండికోట ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన సెట్టింగ్ లో షూటింగ్ చేశారు. అయితే తనను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలిరావడంతో కమల్ హాసన్ షూటింగ్ వదిలి బయటకు వచ్చారు. అందరికీ నమస్కారం చేసి కొద్దిసేపు నిల్చున్నారు. కమల్ హాసన్ ను చూసిన ఆనందంలో అభిమానులు కేరింతలు కొట్టారు.
కాగా 1996లో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమా వచ్చింది. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా ప్రేక్షకులను రంజింపజేసింది. ఇప్పటికే దేశభక్తి సినిమాల్లో భారతీయుడే టాప్ లో నిలుస్తుంది. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం భారతీయుడు-2 తీస్తున్నారు. ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.