టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి జగన్ను టార్గెట్ చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారాలనుకోవడం కోటంరెడ్డి వ్యక్తిగతమన్నారు. కానీ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. కారణాలు వెతికి మరీ టీడీపీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ ఎంతో ఆలోచించి, ఆయనకు టిక్కెట్ ఇస్తే, ఇప్పుడు ఇలా చేస్తున్నారన్నారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నానని, కోటంరెడ్డి వద్ద ఉన్నది ఫోన్ రికార్డింగ్ తప్ప… ట్యాపింగ్ కాదన్నారు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, మ్యాన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. చంద్రబాబు బుట్టలో కోటంరెడ్డి పడ్డారన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయని టీడీపీ పలుమార్లు ఆరోపణలు చేసిందని, దీనికి కోటంరెడ్డి వంత పాడుతున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు ఎలాంటివాడో లోకానికి అందరికీ తెలుసునని చెప్పారు. టీడీపీ అధినేత గురించి తాము, కోటంరెడ్డి ఇదివరకు ఏం మాట్లాడుకున్నామో మాకు తెలుసునని చెప్పారు. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే అయితే, ఈ అవమానం గురించి ఇక్కడ పార్టీలో చర్చ జరుగుతుండగానే, మరోవైపు టీడీపీలో టిక్కెట్ ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని చెప్పిన కోటంరెడ్డి అలా ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. మనకు జగన్ టిక్కెట్ ఇవ్వడంతో రెండుసార్లు గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మనకు ఇప్పుడు పదవులు జగన్ భిక్ష అన్నారు. కానీ చంద్రబాబు నిన్ను పావుగా వాడుకొని రాజకీయం చేస్తున్నారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.
నిన్నటి వరకు జగన్కు విదేయుడిగా ఉన్న నీవు.. ఇప్పుడు చంద్రబాబుకు విధేయుడిగా మారిపోయావా అని ఎద్దేవా చేశారు. జగన్ నిన్ను ఎంతగానో విశ్వసిస్తే, టీడీపీ చేతికి అస్త్రంగా మారావని మండిపడ్డారు. ఆయనకు అనుమానం ఉంటే నెల్లూరు జిల్లాలో బాధ్యతలను నీకు అప్పగించేవారా అని ప్రశ్నించారు. ఈ రోజు కోటంరెడ్డి ఏదో ఆవేదనతో మాట్లాడినట్లుగా కనిపించిందని, కానీ కావాల్సింది ఆలోచన అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని, టీడీపీ వైపు వెళ్తున్న శ్రీధర్ రెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమే అన్నారు. చంద్రబాబు చాలా దుర్మార్గుడు అని, ఆయనే నీతో మాట్లాడించినట్లుగా మేం భావిస్తున్నట్లు చెప్పారు. తనను అరెస్ట్ చేయాలని, ఎన్ కౌంటర్ చేయాలని కోటంరెడ్డి అంటున్నారని, అలాంటి అవసరం లేదన్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
లోకేష్ యువగళం ఫెయిల్ అయింది కాబట్టి, జగన్ పైన బురద జల్లేందుకు కోటంరెడ్డి మార్గాన్ని చంద్రబాబు ఎంచుకున్నారని ఆరోపించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు అన్నారని, కానీ ఆయన వల్ల కాదన్నారు. జగన్ ఎప్పుడూ ఆయనకు భయపడలేదన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడి కోటంరెడ్డి జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీధర్ రెడ్డి భుజాలపై తుపాకి పెట్టి జగన్ను కొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే ఇది ఫోన్ ట్యాపింగ్ కాదని, మ్యాన్ ట్యాపింగ్ అని విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవం గ్రహించాలన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు ఎందుకో చెప్పాలన్నారు. వైసీపీ రూరల్, వెంకటగిరి ప్రజాప్రతినిధులకు అందరికీ చెబుతున్నానని… పార్టీ శాశ్వతమని, వ్యక్తులు తాత్కాలికమేనని కాబట్టి, పార్టీకి అండగా ఉండాలని సూచించారు. పార్టీకి విదేయులుగా ఉన్న వారిని గుర్తుంచుకుంటుందన్నారు.