»Janasena Revealed Another Scam 8348 Acres Of Benami Companies Under Ycp Rule
Janasena: మరో స్కామ్ బయటపెట్టిన జనసేన..వైసీపీ పాలనలో 8,348 ఎకరాలకు ఎసరు!
ఏపీ సీఎం జగన్ 8348 ఎకరాల భూమిని తమ బినామీ కంపెనీలకు ధారాదత్తం చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఒకే ఏడాది ఏడు నెలల్లోనే దాదాపు రూ.76 వేల కోట్ల ప్రాజెక్టులను తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ కంపెనీకి జగన్ అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో సీఎం జగన్ (CM Jagan) కొత్తగా పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి తన బినామీ కంపెనీలకు భూములను కట్టబెడుతున్నట్లు జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో రోజుకో స్కామ్ అనే పేరుతో ఆయన మీడియా సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగే నేడు ఆయన ఇండస్ట్రీస్ శాఖలో జరుగుతున్న కుంభకోణం గురించి మీడియా ముందు వివరాలను తెలిపారు. వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించిందని, అంది కేవలం సీఎం తన బినామీల కోసమే తెచ్చిన విధానమన్నారు.
ఈ విధానం ద్వారా సీఎం తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న రెండు మూడు కంపెనీలకు భూములను కట్టబెడుతున్నట్లు తెలిపారు. రాయపట్నం పోర్టు వద్ద ఇండోసోల్ అనే కంపెనీకి (Indosole) వైసీపీ సర్కార్ 5,148 ఎకరాలను కేటాయించిందని, మొదటి 10 ఏళ్లకు లీజుకు ఇచ్చి ఇప్పుడు కొత్త పాలసీతో (New Policy) ఆ భూమిపై సర్వహక్కులనూ ఇండోసోల్ కంపెనీకి ధారదత్తం చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్కి వైసీపీ సర్కార్ కట్టబెట్టినట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఆ ఇండోసోల్ సంస్థ (Indosole Company) వెనక ఉన్నది షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ అని, ఆ సంస్థ మరెవరిదో కాదని, సీఎం జగన్ సన్నిహితులదేనని వెల్లడించారు. ఇండోసోల్ సంస్థ పుట్టి ఈ రోజుకు 1 సంవత్సరం 9 నెలలు మాత్రమే కావొస్తోందని, ఏడాది క్రితం సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ చేశారన్నారు. న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చి భూములను ధారాదత్తం చేశారని వెల్లడించారు. ఒకే ఏడాది ఏడు నెలల్లోనే రూ.76 వేల కోట్ల ప్రాజెక్టులను సీఎం జగన్ తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్ సంస్థకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.