ఆంధ్రప్రదేశ్ ని ప్రధాని మోదీ ఆదుకోవాలంటూ సీఎం జగన్ రిక్వెస్ట్ చేయడం విశేషం. మోదీ… తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… జగన్ .. ప్రధాని మోదీకి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ విభజన గాయాల నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని ప్రధానికి తెలియజేశారు.
విశాఖలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలుపిన సీఎం జగన్ ఏపీలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో పిల్లల చదువులకు, ప్రజల ఆరోగ్యానికి, రైతలు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ గత మూడున్నరేళ్లుగా ప్రాధాన్యతగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం, ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నామని… మీ సహాయ సహకారాలు మరింతగా అందించాలని ప్రధానిని కోరారు.
8 ఏళ్ల క్రితం తగిలిన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. మీరు రాష్ట్రానికి ఇచ్చే ప్రతిరూపాయి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రధానికి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో అజెండా లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మీ సహకారం గుర్తుపెట్టుకుంటామని, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, రైల్వే జోన్ విషయంలోను ఏపీ ప్రభుత్వం కోరిన అన్ని అంశాలను మీరు సానుకూలంగా పరిగణించాలని, పరిష్కరించాలని కోరుతున్నానని జగన్ సభా ముఖంగా కోరారు. పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటున్నానని జగన్ తన ప్రసంగం ముగించారు.