వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ కాల్ రికార్డులను పరిశీలించగా నవీన్‌తో ఎక్కువ మాట్లాడినట్టు గుర్తించారు. నవీన్.. సీఎం జగన్ భార్య భారతి పీఏ అని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నవీన్ పాత్రపై సీబీఐ అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు జారీచేశారు. నవీన్‌కు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి విచారించే క్రమంలో నవీన్‌కు చాలా కాల్స్ వెళ్లాయని గుర్తించారు. నవీన్ విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. వైఎస్ జగన్ ఇంట్లో నవీన్ గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడని వైసీపీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తాను కూడా వైఎస్ భారతితో మాట్లాడాలంటే నవీన్ నంబర్‌కు ఫోన్ చేస్తానని తెలిపారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. అవినాష్- నవీన్ కాల్ రికార్డులతో తాడేపల్లికి కనెక్ట్ అయిందని విశ్వసనీయంగా తెలిసింది. సీఎం జగన్ బంధువు, కడప ఎంపీ, అవినాశ్ రెడ్డిని ప్రశ్నించిన సమయంలో ఈ విషయం బయటపడింది. దీంతో వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకోవడం ఖాయం అని అధికారులు అంటున్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.. 2019 మార్చి 15వ తేదీన పులివెందులలో గల తన ఇంట్లో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ రోజు ఏం జరిగింది, రక్తపు మరకలు ఎందుకు చెరిపారు, గుండెపోటు వచ్చిందని ఎందుకు చెప్పారు? పలు అంశాలపై అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.