ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాలు సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. దేవినేని ఉమ అయితే వైఎస్ వివేకా కేసును సీబీఐ స్పీడప్ చేసిందని, దృష్టి మరల్చేందుకు రాజధాని అని కామెంట్ చేశారని విమర్శించారు. వైసీపీ మంత్రులు/ నేతలు జగన్ కామెంట్స్‌ను సమర్థిస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏది అని గూగుల్‌లో వెతికినా విశాఖ అనే చూపిస్తుందని అన్నారు.
విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని సీఎం జగన్ మంచి ప్రకటన చేశారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయం అద్భుతంగా ఉందని ప్రజలు స్వాగతిస్తున్నారని వివరించారు. సీఎం హోదాలో జగన్ ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. రాజధానికి ఉండవలసిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయన్నారు. కనెక్టివిటీ పరంగా విశాఖ అనుకూలమని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తాను కూడా విశాఖ వచ్చేస్తున్నానని జగనే చెప్పారని, పారిశ్రామికవేత్తలు విశాఖపట్టణంపై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. విశాఖ నగరానికి విశాలమైన తీర ప్రాంతం ఉందని తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్‌గా రూపుదిద్దుకోనుందని తెలిపారు.