జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఫైర్ అయ్యారు. తనకు వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అంటే అభిమానమే అంటూ చెప్పారు. అదీ సామాజిక వర్గం పరంగా ఏర్పడిందే అని సెలవిచ్చారు. కానీ పవన్ వైఖరి మాత్రం తమ సామాజిక వర్గం బాధపడేలా ఉందని పేర్కొన్నారు. కాపుని సీఎం చేయాలని అనుకునే వారు మాత్రమే పవన్ కల్యాణ్ వెంట ఉన్నారని స్పష్టంచేశారు. కానీ కాపుని సీఎం చేయాలనే ఆలోచన తనకు లేదని తేల్చిచెప్పారు. జగనే సీఎం అని, తిరిగి ముఖ్యమంత్రి పదవీ చేపడుతారని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.
ఇటీవల బాబు- పవన్ మీట్ కావడంతో వారి మధ్య పొత్తు పొడుస్తోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకోసమే వైసీపీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఒకడుగు ముందుకేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ వారి మధ్య అపవిత్ర పొత్తు అని కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ తీరు బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేస్తానని అన్నట్టు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పని మాత్రం చేయొద్దని సూచించారు. దీంతో పవన్ కల్యాణ్‌ను ఎవరికైనా చూపించడ్రా అనే పరిస్థితి వస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయదుందుబి మోగించడం ఖాయం అంటున్నారు. జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకోవడం చంద్రబాబు, పవన్ వల్ల కాదని తేల్చిచెప్పారు. వారి జేజమ్మలు వచ్చినా.. వైసీపీకి అధికారం దక్కకుండా ఆపలేరని పేర్కొన్నారు.
ఎవరైనా రాజకీయ ప్రయోజనం కోసమే పార్టీలు చేరతారు. ఇదే విషయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ ఉదహరించారు. తోట చంద్రశేఖర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారాలు, దాంతో వస్తోన్న ఇబ్బందుల వల్ల కండువా కప్పుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేదంటే ఆయన ఐఏఎస్‌గా రిటైర్ అయ్యాక, ఆ పార్టీలో చేరేవారు కాదని చెప్పారు.
ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబును పవన్ కల్యాణ్ కలువడంతో వైసీపీ నేతలు నుంచి వరసగా రియాక్షన్స్ వస్తున్నాయి. ఏకంగా 12 మంది మంత్రులు మాట్లాడారు అంటే.. పొత్తుపై ఆ పార్టీ భయపడుతోందని టీడీపీ, జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ కల్యాణ్ బీజేపీతో కూడా సఖ్యంగా ఉండటంతో.. ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే సందేహాం సహాజంగానే వస్తోంది. అందుకోసమే మంత్రులు బాహాటంగానే తన మనసులో ఉన్న మాటలను అనేస్తున్నారు. కానీ అధికార పార్టీ భయపడుతోందని టీడీపీ, జనసేన నేతలు కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసమే బాబు- పవన్ కలిస్తే ఇంత రాద్దాంతం చేస్తున్నారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఎన్నికకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, అప్పుడే పొత్తుల గురించి ఎందుకు డిస్కసన్ అని కప్పిపుచ్చేందుకు ట్రై చేస్తున్నారు. మరీ టీడీపీ- జనసేన మధ్య నిజంగా పొత్తు పొడవదా, వారి భేటీ ఏ అంశాలపై సాగిందని సగటు జీవి నుంచి కూడా ప్రశ్న వస్తోంది.