సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం ఖాళీ అయింది! వరుసగా మూడు రోజుల పాటు బోగి, సంక్రాంతి, కనుమ ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వారంతా తమ ఊళ్లకు వెళ్లారు. ఇప్పటికే గురువారం నుండే హైదరాబాద్ నుండి వరుసగా పండుగ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఇసుక వేస్తే రాలనంత జనం ఉండే హైదరాబాద్ నగర కూడలిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. కిలో మీటర్ దూరానికే అరగంట నుండి గంట పట్టే ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి పండుగలకు హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అవుతుంది. ముఖ్యంగా సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ కోళ్ల పందేలకు పెట్టింది పేరు. ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్ పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, అమీర్ పేట, యూసఫ్ గూడ, సరూర్ నగర్, మల్కాజిగిరి, రాజేంద్ర నగర్ ఇలా భాగ్యనగరం వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ లేక రోడ్లు బోసిపోయాయి.
భాగ్యనగరం నుండి వరంగల్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.. ఇలా తెలుగు రాష్ట్రాలలో అటు మూల నుండి ఇటు మూల వరకు జాతీయ రహదారులు బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసిపోయాయి. రైళ్లలో వారం పది రోజుల ముందే బుకింగ్స్ అయిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్ మేర వాహనాల వరుస కనిపిస్తోంది. ప్రతి సంక్రాంతి, ఆ తర్వాత దసరా సమయంలో పండక్కి ఇళ్లకు వెళ్లే వారి కార్లు, ఇతర వాహనాలతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్న 16 టోల్ గేట్లలో పదింటిని హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లడానికి, ఆరింటిని హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.