గోరంట్ల మాధవ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన వైసీపీలో చేరకముందు నుంచే జేసీతో కయ్యం పెట్టుకొని వివాదాల్లోకి ఎక్కారు. ఇటీవల ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడారంటూ వివాదంలో చిక్కారు. అందులో ఉన్నది తాను కాదని.. మార్ఫింగ్ చేశారని ఆయన వాదించినప్పటికీ ఆయన వాదన ఎవరూ పట్టించుకోలేదు. కాగా.. తాజాగా ఆయన మరో వివాదంలోచిక్కారు.
మాధవ్ ఉంటున్న ఇంటికి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని ఆ ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు అద్దె బకాయిలు చెల్లించాలని కోరిన తనను టిప్పర్లు పెట్టి తొక్కించేస్తామంటూ మాధవ్ అనుచరులు బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాధవ్ తన ఇంట్లో అద్దెకుంటున్నారని, అద్దె, విద్యుత్ బకాయిలు మొత్తం కలిపి 2 లక్షల వరకు బకాయిపడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అడిగితే మాధవ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాధవ్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసేందుకు, ధర్నా చేసేందుకు కూడా మల్లికార్జున రెడ్డి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ నేపథ్యంలోనే మాధవ్ కు మల్లికార్జున రెడ్డికి మధ్య పోలీసులు మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తోంది.
అయితే, వీరిద్దరికీ మధ్య జరిగిన తొలివిడత చర్చలు విఫలం కావడంతో మరోసారి ఆ వ్యవహారంపై చర్చలు జరపాలని పోలీసులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా అనంతపురం ఫోర్ టౌన్ స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనంతపురంలోని రామ్ నగర్ లో మల్లికార్జున్ రెడ్డికి చెందిన ఇంట్లో గోరంట్ల మాధవ్ అద్దెకు ఉంటున్నారు. అయితే, సెటిల్మెంట్ అయిన తర్వాత మాధవ్ తన ఇల్లు ఖాళీ చేయాలని మల్లికార్జున్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.