Pawan meet nadda:వైసీపీ పాలన అంతమే తమ లక్ష్యం అని పవన్ కల్యాణ్ (pawan kalyan) అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. జగన్ పాలనకు ఎలా ముగింపు పలుకాలనే అంశంపై భేటీ జరిగిందని పవన్ తెలిపారు. ఈ విషయంలో బీజేపీ, జనసేన పార్టీల వైఖరి ఒక్కటేనని చెప్పారు.
నడ్డాతో గంటపాటు పవన్ సమావేశం కొనసాగింది. సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన ఎజెండా అని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో నిన్న పవన్ కల్యాన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఏపీ బీజేపీ ఇంచార్జీ మురళీధర్‌ను కూడా కలిశారు. కర్ణాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పవన్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ అనుకుంటోంది. నడ్డాతో భేటీ తర్వాత మాత్రం ఆ విషయం గురించి చెప్పలేదు. హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ జరుగుతుందనే ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు.