యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు ఆర్టీసీ డ్రైవర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫోటో, వీడియోలు ట్రోల్ అయ్యాయి. అయితే అతనిని విధుల నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. షేక్ హ్యాండ్ ఇస్తే జాబ్ నుంచి తీసేస్తారా అని చర్చ జరిగింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసివేయలేదని స్పష్టంచేసింది. సోషల్ మీడియాలో ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టింది. వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తోన్న సమయంలో లోకేశ్‌కు ఆర్టీసీ బస్ ఎదురైంది. డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు లోకేశ్‌తో కరచాలనం చేశారు. డ్రైవర్ షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి డ్రైవర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. తనకు మద్దతు ఇచ్చిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని నారా లోకేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ డ్రైవర్‌ను నిజంగానే విధుల నుంచి తొలగించారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఏపీఎస్ ఆర్టీసీని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీంతో ఆర్టీసీ స్పందించింది. ఇది తప్పుడు వార్త అని ఖండించింది.
లోకేశ్ యువగళం పాదయాత్రకు జనం బ్రహ్మారథం పడుతున్నారు. మహిళలు తిలకం దిద్ది, మంగళహారతి ఇస్తున్నారు. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. రోజు 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. స్థానికుల సమస్యలను తెలుసుకుంటున్నారు. మహిళలతో ముచ్చటిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి.. ముందడుగు వేశారు. రైతులు, యువకులు, మహిళల నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది.