Double Decker Bus: తిరుపతి రోడ్లపై సందడి చేసిన ‘డబుల్ డెక్కర్’ బస్సు
తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. నేడు లాంఛనంగా ఒక బస్సును ప్రారంభించగా త్వరలో మరికొన్ని సందడి చేయనున్నాయి. ఇవి తిరుపతి నగరవాసులకు, తిరుమల భక్తులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
తిరుపతి రోడ్లపై డబుల్ డెక్కర్ ఇ-బస్సులు (Double Decker E-Bus) సందడి చేశాయి. ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన తిరుపతి (Tirupathi)లో ఈ డబుల్ డెక్కర్ బస్సులను టీటీడీ (TTD) ఛైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) గురువారం లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఈ బస్సులకు పచ్చజెండా ఊపారు. బస్సులో మొదటిసారి తిరుపతి నగరానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ప్రయాణించి తమ అనుభూతిని పంచుకున్నారు.
డబుల్ డెక్కర్ ఇ-బస్సులు ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత మాట్లాడుతూ..ఈ బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. తిరుమల (Tirumala) సందర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి విచ్చేస్తారని, వారికి ఈ డబుల్ డెక్కర్ బస్సులు మంచి అనుభూతిని ఇస్తాయన్నారు. ఏపీలో తొలిసారిగా ఈ డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు (Double decker Bus Services) తిరుపతిలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
తిరుపతిలో ప్రారంభమైన ఈ బస్సులు ఎలక్ట్రిక్ (Electric) డబుల్ డెక్కలు కావడం విశేషం. వీటిని తిరుపతి లోని నాలుగు ప్రధాన రూట్లలో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒక బస్సును నడిపి, ఆ తర్వాత మిగిలిన బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను 3 గంటల పాటు ఛార్జింగ్ (Charging) చేస్తే 250 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనున్నాయి.
30 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ బస్సుల్లో రెండు అంతస్తుల్లో 65 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఇందులో క్లోజ్డ్ విండోస్, సెంట్రల్ ఏసీ, సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీలో విండోస్‌ను తొలగించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా స్టాపింగ్ పాయింట్లను తెలిపేలా డిజిటల్ బోర్డులు (Digital Boards), అల్లారం, ఎయిర్ బ్యాగ్స్, వైఫై (Wifi), అనౌన్స్మెంట్ మైక్ వంటి సదుపాయాలు ఈ బస్సుల్లో ఉన్నాయి.