ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో… బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని కొంతమేరైనా బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్పటికే జనసేన నేత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
ఏపీలోని మరికొంత మంది కాపు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఏపీ కాపునేతలైన గంటా శ్రీనివాసరావు, మాజీ సీబీఐ అధికారి, మాజీ జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో తోట చంద్రశేఖర్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలా కాలంగా ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని, గంటా వైసీపీలోకి వెళ్తారని వార్తలు వచ్చాయి. కానీ, తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నేత కావడంతో ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఆయనపైనే దృష్టి సారించింది.
బలమైన నేతతో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి కూడా కావడంతో ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే పార్టీకి ఉపయోగం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకుంటున్నది. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం వలన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు బీఆర్ఎస్ లోకి వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.