నిన్న, మొన్నటి వరకు ఏపీలోని అధికార పార్టీ… తెలంగాణలోని అధికార పార్టీల మధ్య స్నేహం బాగానే కొనసాగింది. అయితే… ఈ స్నేహానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ట్విట్టర్ వేదికగా వార్ మొదలుపెడుతున్నారు. గత కొంతకాలంగా… ఏపీ టార్గెట్‌గా తెలంగాణ మంత్రి వరుసబెట్టి విమర్శలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈమధ్య హరీష్ రావు రెండు రాష్ట్రాలకు పోలిక పెడుతున్నారు. ఈ సారి టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన హరీశ్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని, కానీ తెలంగాణలో ఉపాధ్యాయులకు మంచి ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లను కేంద్రం నిలిపేసిందన్నారు.
జగన్‌లా కేంద్రం మాటకు ఒప్పుకుని ఉంటే ఏటా 6 వేల కోట్లు వచ్చేవని అన్నారు. ఈ డబ్బులతో మరికొన్ని పథకాలు పెట్టేవాళ్లమన్నారు హరీశ్‌రావు. ఇక తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్స్ పై బొత్స స్పందించారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బొత్స, హరీష్ రావు ఒక సారి ఏపీ కి వచ్చి ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ పీఆర్సీ.. ఆంధ్రా పీఆర్సీ పక్కపక్కన పెట్టి చూసుకుంటే అప్పుడు తేడా తెలుస్తుందని ఆయన అన్నారు. పరిశీలన లేకుండా ఎందుకు వచ్చిన మాటలు? మాట్లాడుతున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. మన దగ్గర ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.