»Bats Pooja To Bats And Bathing Children With Their Faeces Strange Tradition In Ap
Bats: గబ్బిలాలను పూజించి వాటి మలంతో పిల్లలకు స్నానం..ఏపీలో వింత ఆచారం!
గబ్బిలాలంటే చాలా మందికి అసహ్యం. వాటిని చూసేందుకు కూడా ఇష్టపడరు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో మాత్రం వాటిని పూజిస్తారు. అలాగే వాటి మలంతో తమ బిడ్డలకు స్నానం చేయిస్తారు.
గబ్బిలాలు (Bats) అంటే అందరికీ భయం. వాటిని చూసినా, శబ్దాలు విన్నా ఎంతో మంది అపశకునంగా భావిస్తుంటారు. ఇక పిల్లలైతే చెప్పాల్సిన పనిలేదు. గబ్బిలాలను చూసి దడుచుకోవడం ఖాయం. అటువంటి గబ్బిలాలు వేల సంఖ్యలో ఒక్క చోట చేరితే ఆ ప్రాంతం అంతా ఎంతో భయంకరంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని ఓ ప్రాంతంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఏపీలోని కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని మాధవరం పోడు గ్రామంలో గబ్బిలాలకు సంబంధించిన పరిస్థితి వేరుగా ఉంది.
హిందువులు తమ సాంప్రదాయం ప్రకారంగా చింతచెట్టును, గబ్బిలాలను (Bats) అరిష్టంగా భావిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం గబ్బిలాలకు అవి ఉండే చింత చెట్టుకు పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. చెట్టుపై ఉండే గబ్బిలాల మలంతో అక్కడివారంతా పిల్లలకు స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల వారి పిల్లలకు ఏ అనారోగ్య సమస్యలు రావని వారు నమ్ముతారు. అంతే కాదు ఆ గబ్బిలాల నుంచి వచ్చే శబ్దాలు అక్కడున్నవారు మంచి శకునంలాగా భావిస్తుంటారు. ఆ గబ్బిలాలు ఉండటం వల్లే తమ గ్రామం పాడిపంటతో సుభిక్షంగా ఉందని నమ్ముతుంటారు.
గతంలో మాధవరం పోడు గ్రామంలో గబ్బిలాలు తమ గ్రామాన్ని వదిలి వెళ్లిపోవడం వల్ల దరిద్రం పట్టుకుందని వారు బాధపడ్డారు. ఈ గ్రామంలో 450 కుటుంబాలు వరకూ నివశిస్తున్నాయి. ఆ ఊరి మధ్యలో చింత చెట్టు ఉంది. ఆ చింతచెట్టుకు వేలాది గబ్బిలాలు (Bats) వేలాడుతూ కనిపిస్తుంటాయి. నిత్యం అవి అక్కడే ఉండి భారీ శబ్దాలు చేస్తూ ఉంటాయి. అవి అక్కడ ఉండటం ఎంతో అదృష్టమని, అవి గ్రామంలోకి రావడం వల్లే ఊరంతా సుభిక్షంగా ఉందని, ఊర్లో గొడవలు, కొట్లాటలు వాటివల్లే జరగడం లేదని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
ఊర్లో గబ్బిలాలు (Bats) ఉండటంతో వాటిని సాక్షాత్తూ దేవత పక్షులుగానే గ్రామస్తులు భావిస్తూ నిత్యం వాటికి పూజలు చేస్తుంటారు. ఆ గబ్బిలాల మలంతో పిల్లలకు స్నానం చేపిస్తే పక్షి దోషాలు తొలగిపోయి, వారు ఆరోగ్యంగా ఉంటారని అక్కడివారు గట్టిగా నమ్ముతుంటారు. ఈ గ్రామంలాగానే కోడూరు మండలం, గంగురాజుపోడు గ్రామస్తులు కూడా గబ్బిలాలను పూజిస్తారు. అయితే గత కొంత కాలం క్రితం తమ గ్రామంలో ఉండే గబ్బిలాలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోవడంతో అక్కడ గొడవలు ఎక్కువయ్యాయని, పంటలు కూడా పండటం లేదని వారు చెబుతున్నారు. వేటగాళ్లు గబ్బిలాలను చంపి తినడం వల్లే అవి మాధవరం గ్రామానికి తరలి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు అంటున్నారు.