తిరుమలలో భక్తజనం మధ్య వేడుకగా శ్రీవారి గరుడ సేవ జరిగింది. లక్షకు పైగా జనం ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగుతుంటే భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో (Tirumala Tirupathi Brahmotsavams) ముఖ్య ఘట్టమైన గరుడ సేవ (Garuda Seva) గురువారం రాత్రి సాగింది. శ్రీవారి గరుడ సేవను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఉత్సవాల్లో ఐదో రోజు గరుడ వాహనంపై శ్రీవారు మాఢవీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ఎంతో ఇష్టమైన గరుడ సేవ నయనానందకరంగా సాగింది.
గరుడ సేవ (Garuda Seva) సందర్భంగా తిరుమల వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. గోవింద నామస్మరణతో మాఢవీధులన్నీ మారుమోగిపోయాయి. వేదపండితుల మంత్రాలు, గోవింద నామాల మధ్య ఆ ప్రాంతం తన్మయత్వంతో మునిగిపోయింది. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి. దేవతామూర్తుల కళారూపాలు, కళాకారులు నృత్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
శ్రీవారి గరుడ సేవకు లక్షకు పైగా భక్తులు గ్యాలరీల్లో బారులు తీరారు. భక్తులందరూ కనులారా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంతో మునిగితేలారు. గురువారం ఉదయం మలయప్పస్వామి వారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనం ఇచ్చారు. ఉదయం జరిగిన పల్లకీసేవ ఎంతో కోలాహలంగా సాగింది. భక్తులు స్వామిఅమ్మవార్లకు అడుగడుగునా కర్పూర హారతులు ఇచ్చి తమ మొక్కలు తీర్చుకున్నారు.