టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement Scam Case)లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయన 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ తరుణంలో నేడు ఆయన తెలుగు ప్రజలకు బహిరంగ లేఖను రాశారు. ములాఖత్ సమయంలో కుటుంబ సభ్యులకు ఆ లేఖను ఇచ్చి ప్రజలకు అందించాలని కోరినట్లు సమాచారం. ఇకపోతే జైలులో ఆయన భావోద్వేగ లేఖను రాస్తూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని అన్నారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే ప్రజల సంకల్పంలో తాను ఉన్నానంటూ భావోద్వేగభరితంగా లేఖను రాశారు. ప్రజల నుంచి తనను ఎవ్వరూ దూరం చేయలేరని, జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తుంటే తన 45 ఏళ్ల ప్రజా జీవితమే కళ్ల ముందు మెదులుతోందన్నారు.
ఓటమి భయంతో తనను జైల్లో బంధించి ప్రజలకు దూరం చేశారని, కానీ సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి తనే అందరికీ గుర్తుకొస్తానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. త్వరలో తాను బయటికి వచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తానని అన్నారు. తన భార్య భువనేశ్వరి ప్రజల ముందుకు వస్తోందని, నిజం గెలవారి పేరుతో ఆమె చేస్తున్న పోరాటానికి అందరూ సహకరించాలని కోరారు.
త్వరలో చెడుపై మంచి విజయం సాధిస్తుందన్నారు. అలాగే తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు (Chandrababu) విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆఖరిలో స్నేహ బ్లాక్ రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajamundry Central Jail) నుంచి అంటూ తన లేఖను చంద్రబాబు ముగించారు. బాబు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Letter Viral) అవుతోంది.