వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస, సైకో పాలన సాగుతోందని మండిపడ్డారు. సైకో పాలన పోవాలంటే.. సైకిల్ రావాలన్నారు. వైసీపీ గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామన్నారు. కానీ మద్యంపాలసీ పైనే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఊరూరా వాడవాడలా మద్యం ఏరులై పారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతికేళ్ళ పాటు మద్యం షాపులు తనఖా పెట్టి ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా ? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. నేను హోం మంత్రిని.. మా నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంతో దూరం లేదన్నారు. నేను హోంమంత్రిని అయ్యాక.. ఇప్పుడున్న పోలీసులు అప్పుడు నాకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసులను వదిలే ప్రసక్తే లేదన్నారాయన.