Amit Shah: గత నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీలో అవినీతి, ఆరోపణలు.. కుంభకోణాలు తప్ప అభివృద్ధి ఏం జరగలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్నారని.. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలపై సీఎం జగన్ సిగ్గుపడాలని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే.. సీఎం జగన్ తన ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని అమిత్ షా (Amit Shah) మండిపడ్డారు. రేషన్ బియ్యాన్ని మోడీ ఇస్తుంటే.. అలానే చేస్తున్నారని ఆరోపించారు. మరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏమయ్యాయో తెలుపాలని కోరారు. విశాఖలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో అమిత్ షా పాల్గొన్నారు.
భూ మాఫియా, మైనింగ్ స్కామ్
విశాఖను విద్రోహ శక్తులకు అడ్డాగా మార్చారని అమిత్ షా (Amit Shah) విమర్శించారు. ఏపీలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో భూ మాఫియా, మైనింగ్ స్కామ్ జరుగుతున్నాయని చెప్పారు. విశాఖ ల్యాండ్ మాఫియా, అరాచక మాఫియా జరుగుతోందని అన్నారు. నిన్న శ్రీకాళహస్తి వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్స్ చేయగా.. ఈ రోజు అమిత్ షా దానికి కొనసాగింపుగా మండిపడ్డారు. ఏపీలో జరిగే అక్రమాల అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న నిధులను రైతు భరోసా పేరుతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న ఇళ్లను కూడా తమ పథకంగా వైసీపీ చెప్పుకుంటోందని విమర్శించారు.
12 లక్షల కోట్ల అవినీతి
ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను అమిత్ షా (Amit Shah) వివరించారు. మన్మోహన్ హయాంలో దేశంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని గుర్తుచేశారు. అయినప్పటికీ చర్యల తీసుకోలేదని వివరించారు. మోడీ 9 ఏళ్ల పాలనలో అవినీతికి తావులేదన్నారు. పుల్వామా ఘటనకు 10 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. మోడీ ప్రధాని అయ్యాక భారత సైనికుల బలం పెరిగిందన్నారు. ప్రపంచం ముందు భారతదేశ గౌరవాన్ని మోడీ పెంచారని.. యావత్ ప్రపంచం మోడీ జపం చేస్తోందని తెలిపారు. 2024లో బీజేపీ 300కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో 25 పార్లమెంట్ స్థానాల్లో 20 సీట్లను గెలిపించాలని కోరారు.