»Aditya L1 Launch To The Sun Is A Success Its Special Features
Aditya L1: సూర్యుడిపైకి ఆదిత్య ఎల్1 ప్రయోగం సక్సెస్..దీని ప్రత్యేకతలివే
ఇస్రో ఇటివల మూన్ పైకి చంద్రయాన్3 ప్రాజెక్టును ప్రయోగించి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సూర్యుడిపైకి మరో కీలక ప్రాజెక్టు ఆదిత్య ఎల్1ను ప్రయోగించి అదరగొట్టింది. అయితే అసలు దీనిని సూర్య గ్రహంపైకి ఎందుకు ప్రయోగించారు? దీని ప్రత్యేకతలు ఏంటీ? దీని కోసం ఎంత ఖర్చు చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Aditya L1 launch to the Sun is a success its special features
భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించిన pslv c57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేసింది. కాగా సూర్యుడు..భూమి మధ్య ఉన్న 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణం చేస్తుంది. ఎల్ 1 లక్ష్య పాయింట్‌ను చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ఆదిత్య వ్యోమనౌకను సూర్యునికి దగ్గరగా పంపించరు. కానీ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్ 1 వద్ద ఉండే.. సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. దీని వల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది.
ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉన్నాయి. సూర్యుడిపై ఉప సూర్యగోళంపై ప్రసరించే శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపల పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. ఎల్-1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా నాలుగు పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు.. సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి.
సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా ఇదేనని చెప్పవచ్చు. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు చాలా అవసరం. పైగా పాలపుంతతో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. మరోవైపు సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లితే మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి అటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది. దీంతోపాటు క్రోమోస్పియర్ సహా సూర్యుని ఎగువ వాతావరణంను అధ్యయనం చేయనుంది. సూర్యుని వాతావరణం ఎలా వేడెక్కుతుంది? మంటలు ఎలా వస్తున్నాయనే దానిపై రిసేర్చ్ చేయనుంది. మరోవైపు సౌర విస్ఫోటనం సంఘటనలకు దారితీసే ప్రక్రియల క్రమాన్ని కూడా గుర్తించనుంది.
ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక పెద్ద ముందడుగు కానుంది. ఇది సూర్యుని ప్రభావం గురించి విలువైన సమాచారాన్ని ఇండియాకు అందించనుంది. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ప్రారంభించడం సాంకేతిక కారణాల వల్ల చాలాసార్లు ఆలస్యం అయింది. అసలు ప్రయోగ తేదీ 2020లోనే ప్రయాగించాల్సింది. కానీ తర్వాత 2021కి, ఆపై 2022కి వెనక్కి నెట్టబడింది. కరోనా కారణంగా ప్రయోగం 2023కి వాయిదా పడింది. ఈ మిషన్ కోసం బడ్జెట్ సుమారు 400 కోట్ల రూపాయలు అయినట్లు తెలుస్తోంది. ఈ డబ్బు వ్యోమనౌక రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగ, నిర్వహణకు ఉపయోగించబడుతుంది.
అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాసా.. యూరోపియేన్ స్పేస్ ఏజెన్సీ, జర్మన్ స్పేస్ ఏజెన్సీ, చైనా మాత్రమే సూర్యుడిపైకి ప్రయోగాలు చేశాయి. ప్రస్తుతం ఆదిత్య ఎల్1 ప్రయోగంతో ఇండియా కూడా ఈ దేశాల జాబితాలో 5వ దేశంగా చేరింది. మొదటిసారిగా అమెరికాకు చెందిన నాసా 2018 ఆగస్టు 12న పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో సూర్యుడిపైకి ఒక ప్రయోగాన్ని చేసింది. ఇది 2021లో సూర్యుడి కరోనా ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి పంపించింది. కానీ నాసా అప్పుడే ఏకంగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం.