ఏపీ సీఎం జగన్ కు ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితం సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. అయితే ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలోని సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో తిరిగి విమానాన్ని గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన వల్ల సీఎం జగన్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు.
సీఎం జగన్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 5 గంటల 3 నిమిషాలకు విమానం టేకాఫ్ అవ్వగా సాంకేతిక సమస్య కారణంగా 5 గంటల 20 నిమిషాలకు మళ్లీ అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని గన్నవరం నుంచి తాడేపల్లిలోని నివాసానికి బయల్దేరి వెళ్లారు. సీఎం జగన్ తో పాటుగా విమానంలో ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నట్టుగా సమాచారం.