గాడిద పాల (Donkeys Milk)కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ గాడిద పాలు వేల రూపాయలు పలుకుతోంది. సాధారణంగా ఆవు పాలు మార్కెట్లో బాగా చిక్కగా ఉంటే రూ.60 నుంచి రూ.80 వరకూ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం గాడిద పాలు ఏకంగా రూ.10 వేలకు దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారంగా 7 వేల రూపాయలు పలుకుతోంది. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురంలోని చుట్టుపక్కల గ్రామాలకు గాడిదలు తోలుకొస్తుంటారు.
ఇంటి ముందే గాడిద పాలు పితికి ఇస్తారు. చాలా మంది పిల్లలకు గాడిద పాలు తాగిస్తే చురుగ్గా ఉంటారని చెబుతుంటారు. అయితే కాలక్రమేణ అది మరుగున పడింది. ప్రస్తుతం పిల్లలకు వస్తున్న అనారోగ్యాల రీత్యా ఈ గాడిద పాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హిందూపురం ప్రాంతంలో గాడిద పాలు లీటర్ ఏడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. 50 ఎం.ఎల్ గాడిద పాలకు వంద రూపాయలు అవుతోంది.
గాడిద పాల(Donkeys Milk)కు డిమాండ్ ఎక్కువవడంతో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన రాజు అనే వ్యక్తి గాడిదలు తోలుకొని వీధి వీధి తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు. కర్ణాటకలో ఆ వ్యక్తి సుమారు 25 గాడిదలతో ఒక ఫామ్‌ని ఏర్పాటు చేయడం విశేషం. గాడిద పాలు తాగితే ఉబ్బసం, గ్యాస్ట్రిక్, మోకాళ్ళ నొప్పులు, పచ్చకామెర్లు తదితర రోగాలు నయమైపోతాయని పెద్దలు చెబుతుండగా ఇప్పుడు వాటిని మెల్లమెల్లగా పాటించడం మొదలెడుతున్నారు. గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని కొందరు అటువైపుగా మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆ పాలకు గిరాకీ పెరిగింది.