టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొని కళాతపస్వికి తుది వీడ్కోలు పలికారు.
గత కొంతకాలంగా కె.విశ్వనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యల వల్ల ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో మరపురాని సినిమాలతో సినీ ప్రేక్షకుల మదిలో కె.విశ్వనాథ్ చిరస్థాయిగా జీవించి ఉంటారని గుర్తుచేసుకున్నారు. ఆయన అందించిన సినిమాలు, ఆయన సినిమాల్లోని పాటలు అందర్నీ పలకరిస్తూనే ఉంటాయని కె.విశ్వనాథ్‌ను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. కె.విశ్వనాథ్ సినీ పరిశ్రమకు చాలా మంది సినిమా యాక్టర్లను పరిచయం చేశారు. ఆయనతో పనిచేసిన టెక్నీషియన్లు విశ్వనాథ్‌ను తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అభిమానులు, కుటుంబీకుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు సాగాయి.