»Telangana Those Who Dont Pay Rythubandhu Scheme Should Be Slapped Ktr
Telangana: రైతుబంధు ఇవ్వని వారిని ఏ చెప్పుతో కొట్టాలి: కేటీఆర్
తెలంగాణలో రైతుబంధు డబ్బులు పడకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన హామీలను అమలు చేయకపోతే బట్టలిప్పి నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు.
రైతుబంధు ఇవ్వని వారిని ఏ చెప్పుతో కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. నేడు కరీంనగర్ లో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీని గెలిపించి నేడు చాలా మంది రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే రైతు బంధు డబ్బులు అందరి ఖాతాల్లో జమ అయి ఉండేవన్నారు. ఈ విషయంలో రైతులు పశ్చాత్తాప పడుతున్నారని కేటీఆర్ అన్నారు. గుంపు మేస్త్రీ రావడం ఏమో గానీ ఇంకా రైతుబంధు రాలేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా రైతు బంధు ఇవ్వని వారిని ఏ చెప్పుతొ కొట్టాలని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకు చెప్పిన హామీలను అమలు చేయకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలను బట్టలిప్పి నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. తాము శాసనసభ ఎన్నికల్లో ఓడినా, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చూపిస్తామన్నారు. అసెంబ్లీ ఓటమి తమకు చాలా చిన్నదని, కమాండర్ కేసీఆర్ త్వరలోనే రాబోతున్నారని తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ పై ఇంకా విశ్వాసంతో ఉన్నారని, గుంపుమేస్త్రీ పాలనను పారదోలుతామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.