ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు వరుసగా రెండు రోజులు రద్దయ్యాయి. ముందే నిర్ణయించిన పర్యటనలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. కార్యక్రమాలను వరుసగా రద్దు చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగం కావడమేనని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ కేసు విచారణ వేగం పెరిగింది. సీబీఐ రంగంలోకి దిగి తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి విచారణకు పిలవడం వరకు చేరింది. దీంతో వైఎస్ జగన్ వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్ లో విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి తొలి నోటీస్ పంపినప్పటి నుంచి సీఎం జగన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. సీఎం ఆదేశాలతోనే తొలి విచారణకు హాజరు కాలేనని అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడని సమాచారం. ఈ వారం రోజుల పాటు మరోసారి నోటీసులు ఇస్తే ఏం చేయాలనే దానిపై జగన్ న్యాయ నిపుణులు, పార్టీ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. మళ్లీ వెంటనే అవినాశ్ కు రెండోసారి నోటీసులు పంపడంతో సీఎం జగన్ ఢిల్లీ స్థాయిలో నివారణ ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నించాడని తెలుస్తున్నది. కేంద్ర పెద్దలతో సీబీఐ దూకుడు తగ్గించేందుకు సన్నాహాలు చేశాడు. ఢిల్లీ వెళ్లి విచారణను నిలువరించే ప్రయత్నం చేయాలని సీఎం జగన్ భావించాడు. ఆ క్రమంలోనే కేంద్ర పెద్దలను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోసం యత్నించారు. ఏ క్షణాన అపాయింట్మెంట్ లభించినా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని భావించారు. అందుకే రెండు రోజులుగా నిర్దేశించిన కార్యక్రమాలకు జగన్ రద్దు చేసుకున్నారు.
వాస్తవంగా శుక్రవారం సీఎం జగన్ హైదరాబాద్ తో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో పర్యటించాలి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కానీ ఆ రోజు పర్యటన రద్దయ్యింది. అనంతరం శనివారం విశాఖలో శారదా పీఠం వార్షికోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే ప్రయత్నాలు ఒకవైపు.. మరోవైపు తాడేపల్లిలోనే న్యాయ నిపుణులతో సమాలోచనలు చేశారు. సీబీఐ దూకుడుతో ముందుకు వెళ్లితే ఏం చేయాలనే ఆలోచనలు చేసినట్లు తెలుస్తున్నది. దీనికోసమే రెండు రోజులుగా సీఎం జగన్ వరుస పర్యటనలు రద్దు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణ చేయడంతో సీఎం జగన్ లో కలవరం మొదలైనట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. సీఎం జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొంటున్నారు.