కొంతమంది ఎమ్మెల్సీలు గవర్నర్ తమిళసాయి పట్ల ఉపయోగించిన భాషను చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుంటోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల టీఆరెఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలున్నాయి. మహిళ పట్ల.. అది కూడా గవర్నర్ పట్ల ఇలాంటి మాటలు ఏమిటని అన్ని పార్టీలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈటల కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. గవర్నర్ ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని, మహిళలను అవమానించడమే అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. తాను పార్టీలు మారేవాడిని కాదన్నారు.
తెలంగాణ ఈ దేశంలో భాగం కాదన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, దేశంలోని రాష్ట్రాలన్నీ రాజ్యాంగానికి లోబడే పని చేయాలని ఆయన గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణ కేసీఆర్.. తాత జాగీర్ కాదన్నారు. తెలంగాణలో ఏ గ్రామ రైతులైనా 24 గంటల కరెంటు వస్తుందని చెబితే రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర వేడుకలను నిర్వహించకపోవడం సిగ్గుచేటు అని, కేసీఆర్ రాజ్యాంగం పట్ల వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో సమస్యలుంటే సీఎంలు పరిష్కరించుకుంటు న్నారని, అంతేగానీ రిపబ్లిక్ డేను బహిష్కరించలేదన్నారు. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం లేకపోవడం శోచనీయం అన్నారు.