Vijayakanth: అశ్రునయనాల మధ్య ముగిసిన విజయకాంత్ అంత్యక్రియలు
కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్ అంత్యక్రియలు ముగిశాయి. కడసారి ఆయన పార్దీవదేహాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలను బంధువులు, కుటుంబీకులు పూర్తి చేశారు.
అశ్రునయనాల మధ్య విజయకాంత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. భారీగా అభిమానులు తరలివచ్చి కెప్టెన్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. విజయకాంత్ మరణంతో కోలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన అంతిమయాత్రకు భారీగా ఫ్యాన్స్ వచ్చారు. కడసారి ఆయన్ని చూసేందుకు రాలేకపోయినవారు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.
విజయకాంత్ ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమల్, రజనీకాంత్ వంటివారు పోటాపోటీగా సినిమాలు చేస్తున్న తరుణంలో తనకంటూ సొంత మార్కెట్ ను విజయకాంత్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన డైలాగ్ డెలివరీ, ఎర్రటి కళ్లతో అందర్నీ ఆకట్టుకున్నారు. పోస్టర్ తోనే ఆయన సినిమాలపై భారీ అంచనాలు నెలకొనేవి.
సినీ ఇండస్ట్రీలో చిన్న నిర్మాతలకు ఆయన వసూలు చక్రవర్తిగా మారారు. 1984లో విజయకాంత్ ఏకంగా 18 సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. మదురైలో పుట్టిన విజయకాంత్ తెలుగు భాషలో బాగా మాట్లాడేవారు. ఆయనకు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2018లో నటించిన మధురవీరన్ ఆయన ఆఖరి సినిమా.