»28 To Six Guarantee Applications Will Be Accepted Ponguleti
6 Guarantees: 28 నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తులు స్వీకరిస్తాం: పొంగులేటి
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో, ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు.
ముందుగా ఈ దరఖాస్తులను ప్రజలకు అందిస్తామని, ఆపై వాటిని డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని వివరించారు. గ్రామసభల్లో ఈ దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులు సమర్పించిన వారికి అధికారులు ఒక రసీదు ఇస్తారని పొంగులేటి చెప్పారు. అధికారులు ఆ దరఖాస్తులు పరిశీలించి, వారు ఏ పథకాలకు అర్హులో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ప్రాంతంలో కేవలం 10 ఇళ్లు ఉన్నా సరే, అధికారులు అక్కడికి వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించామని పొంగులేటి స్పష్టం చేశారు.