Telangana: డిసెంబర్ 28 నుంచి ‘ప్రజాపాలన’ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో డిసెంబర్ 28వ తేది నుంచి జనవరి 6వ తేది వరకు ప్రజా పాలన కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలు అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలు మున్సిపల్ వార్డుల్లో రోజుకు రెండు చొప్పున అధికార బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాపాలన కార్యక్రమానికి సర్పంచ్ స్థానిక కార్పొరేటర్ కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు. గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.