తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్ అవమానించిందని పేర్కొన్నారు. తమిళి సై సౌందరరాజన్ పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాజ్ భవన్లో ఎట్ హోం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం లేదని విశ్వసనీయ సమాచారం.
‘ప్రజల మధ్య గణతంత్ర వేడుకలు జరగకుండా చేయాలని ప్రయత్నించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టుకు వెళ్లడంతో మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చింది. గణతంత్ర వేడుకలు ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశా. దానిని పక్కనపెట్టి రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలని రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం పంపలేదు’ అని తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ తీరు గురించి కేంద్రానికి తమిళి సై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గణతంత్ర వేడుకల నిర్వహణ గురించి, రాష్ట్ర ప్రభుత్వ తీరు, హైకోర్టు ఆదేశాలు, తాజా పరిస్థితుల గురించి డిస్కష్ చేస్తారని తెలిసింది. అందుకోసం ఢిల్లీ వెళతారని తెలిసింది.