Revanth Reddy: రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ముఖ్యమంత్రి పదవీ వరించింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు.. సీఎం పదవీ అంటే చాలు, చాలామంది పేర్లు వినిపిస్తాయి. అలాంటిది పీసీసీ చీఫ్ సీఎం పదవీ చేపట్టబోతున్నారు. గతంలో పీసీసీ చీఫ్ సీఎల్పీ నేతగా ఎంపిక కాలేదు. ఆ సాంప్రదాయాన్ని రేవంత్ (Revanth)తుడిపేశారు. ఇక రేవంత్ రాజకీయ ప్రస్థానాన్ని ఓ సారి తెలుసుకుందాం. పదండి.
వ్యవసాయ కుటుంబం
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 ఏట రామచంద్రమ్మ-నరసింహారెడ్డి దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవాడు. విద్యార్థి దశలో ఏబీబీపీలో పనిచేశారు. తర్వాత 2002లో అప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత స్థబ్దుగా ఉన్నారు. 2006లో జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ వెంటనే జూబ్లిహిల్స్ సొసైటీకి అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించారు. మరో విశేషం ఏమిటంటే.. 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 2008లో తెలుగుదేశం పార్టీలో చేరి.. ఆ పార్టీలోనే ఎదిగారు. రాజకీయ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
టీడీపీ లీడర్‌గా గుర్తింపు
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నేతగా చురుగ్గా పనిచేశారు. చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉండేది. అందుకే తన నియోజకవర్గం కాకున్నప్పటికీ కొడంగల్ నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. 2014లో కూడా విజయం సాధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ప్రభ తగ్గుతూ వచ్చింది. చివరికీ 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హై కమాండ్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. రేవంత్ భార్య గీత.. వీరిద్దరికీ ప్రేమ వివాహాం.. రేవంత్ బంధువు సీనియర్ నేత, స్వర్గీయ జైపాల్ రెడ్డి అనే సంగతి తెలిసిందే. ఆయప కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న సమయంలోనూ.. రేవంత్ టీడీపీలో పనిచేశారు. తర్వాత మారిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ దంపతులకు కూతురు నైమిష.. ఆమెకు వివాహామైంది.
ఓటమి.. ఆ వెంటనే విజయం
2018లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సరిగ్గా ఎన్నికల సమయంలో కేసులు, అరెస్ట్ చేయడంతో రేవంత్ ఓడిపోయారు. కానీ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో.. మల్కాజిగిరి నుంచి పోటీ చేసి జయభేరీ మోగించారు. ఇక అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. యాక్టివ్‌గా ఉండటం.. అందరితో చొచ్చుకొని వెళ్లడంతో 2021లో రేవంత్ రెడ్డికి పీసీసీ పదవీని అప్పగించారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత.. అందరినీ కలుపుకొని వెళ్లారు. పార్టీ వీడిన అందరూ నేతలను తిరిగి చేర్చుకున్నారు. సమిష్టిగా శ్రమించి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు.
పీసీసీ చీఫ్, సీఎం
ప్రస్తుతం టీ పీసీసీ చీఫ్ పదవీతోపాటు మల్కాజిగిరి ఎంపీగా ఉన్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికవడంతో.. ఆ రెండు పదవులకు రాజీనామా చేస్తారు. ఒకటి రాజ్యాంగ బద్ద పదవీ కాగా.. మరొకటి పార్టీ పదవీ.. రేవంత్‌కు సీఎం పోస్ట్ ఇవ్వడంతో సీనియర్లు అలకబూనే అవకాశం ఉంది. అయినప్పటికీ అందరినీ కలుపుకొని వెళతాం అని.. టీమ్‌గా కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నొక్కి మరీ చెప్పారు. దీంతో ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు తదితర నేతలకు ప్రాధాన్యం ఉన్న పోస్టులే ఉంటాయని తెలుస్తోంది.
రాహుల్ అండ
కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవీ ఇవ్వడమే గొప్ప.. అలాంటిది పీసీసీ చీఫ్‌కు సీఎం పదవీ కట్టబెట్టడం మాములు విషయం కాదు. గత సాంప్రదాయాలను ఆ పార్టీ మెల్లిగా చెరచుకుంటూ వస్తోంది. అందుకోసమే ఆ పార్టీ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే సీఎం పదవీ ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. ఆ మేరకు ఇచ్చారనే వాదన కూడా ఉంది. ఏదీ ఏమైనప్పటికీ విద్యార్థి నేత నుంచి ఇప్పుడు సీఎం పదవీ చేపట్టే వరకు ఎదిగారు రేవంత్.