Online Games: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దాంతో పాటు అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ మాత్రమే కాదు. క్రికెట్, క్యాషినో వంటి ఎన్నో గేమ్స్ పై ఆన్ లైన్లో బెట్టింగ్ పెట్టి ఆడుతున్నారు. చాలా తక్కువ మంది డబ్బులు సంపాదిస్తుంటే… చాలా వరకు గేమ్స్ లో డబ్బులు పోగ్గొటుకొని ప్రాణాలు తీసుకునే వారు కూడా ఉన్నారు. అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆన్ లైన్ గేమ్ లో గేమ్స్ ఆడి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీర్చ లేక ఆత్మ హత్య చేసుకున్నాడు. అతడు ఆడేందుకు ఆన్ లైన్ లో లోన్ తీసుకొని కట్టలేక ఆఖరికి ప్రాణాలు తీసుకున్నాడు.
ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. మిట్టపెల్లి సాయి అనే వ్యక్తికి ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు ప్రశాంత్ (17) లక్నేపల్లిలోని బిట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే కొన్ని రోజులుగా ప్రశాంత్ ఆన్ లైన్ గేమ్స్ కి బాగా అలవాటు పడిపోయాడు. గేమ్స్ ఆడేందుకు ఆన్ లైన్ యాప్స్ ద్వారా రెండు లక్షల రూపాయాలు రుణం తీసుకున్నాడు. ఇవి తిరిగి చెల్లించే క్రమంలోనే యాప్స్ కస్టమర్ కేర్ నిర్వాహకుల ఒత్తిడి ఎక్కువైంది. తిరిగి లోన్ కట్టలేని ప్రశాంత్ ఇంట్లో తన పేరెంట్స్ కి తెలిస్తే ఏమంటారో అన్న భయంతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.