టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం లోకేష్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 27న కుప్పం నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, ప్రారంభిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం గం.1.20కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మొదట ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం గం. 3.15కు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తారు.
అక్కడి నుండి విమానంలో సాయంత్రం గం.4.30కు కడపకు వెళ్తారు. అక్కడ అమీన్‌పీర్ దర్గాను, తర్వాత రోమన్ కేథలిక్ కెథడ్రల్ చర్చిని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6.30కు కడప నుంచి బయల్దేరి రాత్రి గం.10.30కు తిరుమల చేరుకుంటారు. అక్కడే జీఎంఆర్ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 26న ఉదయం శ్రీవారిని దర్శించుకుని 10.30 గంటలకు తిరుమల నుండి బయల్దేరి మధ్యాహ్నం గం.2.30కు కుప్పం చేరుకుంటారు. అక్కడి నుండి 27వ తేదీన పాదయాత్రను ప్రారంభించనున్నారు.