Revanth Reddy: కొడంగల్ యువతకు ఉద్యోగాలను అందించేందుకు జరుగుతున్న యుద్ధమే ఎన్నికలు అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని కామెంట్స్ చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజు నామినేషన్ వేశానని.. తెలంగాణ గెలవబోతుందని.. కొడంగల్ నుంచే ఆరంభం అవుతోందని తెలిపారు.
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు లక్ష 20 వేల మెజార్టీ వచ్చిందని రేవంత్ గుర్తుచేశారు. తనకు అంతకన్నా ఎక్కువ మెజార్టీ రావాలని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన ప్రయోజనం లేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. అభివృద్ధి చేసి ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
సాగునీరు తేలే, కాలేజీలు రాలేదని విమర్శలు గుప్పించారు. సిరిసిల్ల, సిద్దిపేటను అభివృద్ధి చేసినట్టు కొడంగల్ ఎందుకు చేయలేదని రేవంత్ అడిగారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోనియా గాంధీ నియమించారని.. తనకు ఉన్నత పదవీ అప్పగించారని తెలిపారు. తనకు ఆ స్థాయి విలువ, గౌరవం ఇచ్చారని.. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.