తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Dept) తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది. ఉత్తర తమిళనాడు (Tamil Nadu) సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. తెలుగు రాష్ట్రాల వైపు తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలోను వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉంది. వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 22.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.తెలంగాణలో సెప్టెంబర్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.