నారా లోకేష్.. పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ పాదయాత్ర కి ప్రభుత్వం పెడుతున్న కండిషన్స్ పై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు.
లోకేష్ పాదయాత్ర కు జగన్ అవినీతి పాలనతో ఇబ్బందీ పడి కడుపు మండిన ప్రజలు ఎంత మంది వస్తారో అంచనా వేయడం సాధ్యమా అని అన్నారు. జగన్ , షర్మిల పాదయాత్రకు ఏ విధంగా పోలీసులు అనుమతి ఇచ్చారో లోకేష్ పాదయాత్రకు అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లే హక్కు రాజ్యాగమే ఇచ్చిందని డీజీపీ గుర్తు పెట్టుకోవాలన్నారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలను చూస్తారని బోండా ఉమా హెచ్చరించారు.