దక్షిణ కాశీగా పిలిచే అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. జనవరి 26వ తేది వరకూ ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణ ఏకైక శక్తి పీఠంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. రజాకార్ల సమయంలో జోగుళాంబ అమ్మవారి మూలవిరాట్ ను బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచారు.
2005లో వసంత పంచమి రోజున కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా వసంత పంచమికి ఐదు రోజుల ముందు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో ఈ ఆలయంలో వసంత పంచమి రోజున వెయ్యి కళశాలతో అమ్మవారికి అభిషేకం చేసేవారు. అయితే ఈసారి మాత్రం ఐదు రోజుల పాటు వెయ్యి కళశాలతో నిత్యం పూజా కార్యక్రమాలు చేయనున్నారు.