Lunar Eclipse: కుమార పౌర్ణమి సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది. గ్రహణ కాలం ముందు దేశంలో అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు నిర్వహించరు. ఆలయాల తలుపులు మూసి వేసి ఉంచుతారు. రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం వల్ల పూరి శ్రీ క్షేత్రంలో జగన్నాథ సన్నిధి మాత్రం తెరిచే ఉంటుంది. స్వామికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. స్వామి వారికి భక్తులు మౌన ప్రార్థనలు చేస్తారు.
గ్రహణం (Lunar Eclipse) వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. తర్వాత మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ సేవలు నిర్వహిస్తారు. గ్రహణం సందర్భంగా కొన్ని రాశుల వారికి మంచి జరగనుండగా.. మరికొందరు చూడొద్దని చెబుతున్నారు.
మేష, కర్కాటక, సింహరాశుల వారు గ్రహణం చూడొద్దని పండితులు చెబుతున్నారు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కూడా చూడొద్దని కోరారు. కుమార పౌర్ణమి పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వారు మధ్యాహ్నం 3.30 గంటల లోపు చేయాలని సూచించారు. భోజనం 4 గంటల్లోపు తీసుకోవాలని కోరారు. తర్వాత ఆహారం తీసుకోవద్దని సూచించారు.
మూడు రాశులు, అశ్విని నక్షత్రం మినహాయిస్తే మిగతా తొమ్మిది రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గ్రహణ స్పర్శ కాలం రాత్రి 01.05 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 02.01 గంటలకు విడువనుంది. మోక్షకాలం రాత్రి 2.22 గంటలకు అవనుంది. గ్రహణ స్నానాలు చేయాలని అనుకునే వారు రాత్రి 2.30 గంటలకు చేయాలని పండితులు కోరారు.