»The Aussies Had A Great Victory Over The Young Netherlands
World Cup : పసికూన నెదర్లాండ్స్ పై ఆసీస్ రికార్డు విజయం
ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఆసీస్ ఆ తర్వాత వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది.
వన్డే వరల్డ్ కప్ (World Cup) చరిత్రలోనే అత్యంత దారుణ పరాజయాన్నిపసికూన నెదర్లాండ్స్ మూటగట్టుకుంది. న్యూఢిల్లీ(New Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 309 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రతి బంతి నుంచి పరుగులు పిండుకుంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆసీస్ ఆటగాళ్లు నెదర్లాండ్స్(Netherlands)కు మాత్రం మర్చిపోలేని దారుణ అనుభవాన్ని మిగిల్చారు. సపారీలపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న నెదర్లాండ్స్ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్ వన్‌సైడ్ చేసింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో అత్యంత భారీ విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసి 399 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను 90 కే పరిమితం చేసింది.
ఫలితంగా కంగారూలు.. 309 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఆస్ట్రేలియా విజయంలో ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Maxwell) కీలక పాత్ర పోషించాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీతో వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌కు డేవిడ్ వార్నర్ (David Warner)సెంచరీ కూడా తోడవడంతో ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందుంచింది. ఆసీస్ నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఏ దశలోనూ పోటీనివ్వలేదు. 28 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) నెదర్లాండ్స్ పతనాన్ని ప్రారంభించాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 90 వద్ద ముగిసింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు 4 వికెట్లు తీయగా.. మార్ష్ 2 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.